Friday, August 21, 2020

టాలీవుడ్‌కు ‘గ్యాంగ్ లీడర్’.. అభిమానులకు ‘అన్నయ్య’.. అమ్మకు మాత్రం శంకరం బాబే!

మెగాస్టార్.. ఈ సౌండ్ వింటేనే కొన్ని కోట్ల మంది కళ్లలో వెలుగు కనిపిస్తుంది. ఆ సౌండ్‌లో ఉన్న పవర్ అలాంటిది. నాలుగు దశాబ్దాలకు పైగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక అసాధారణ నటుడిగా ఎదిగి తెలుగు ప్రజలకు ‘అందరివాడు’ అయ్యారు. స్వయంకృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా.. ‘గ్యాంగ్ లీడర్’గా మారారు. అందుకే, మెగాస్టార్ బర్త్‌డే అంటే కేవలం అభిమానులకే కాదు సినీ తారలకు కూడా ఒక పండుగే. నేడు తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణాన్ని, ఎదుగుదలను ఒకసారి గుర్తు చేసుకుందాం. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌గా 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు చిరంజీవి తొలి సంతానం. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. చిరంజీవిని కుటుంబంలో అంతా శంకరం బాబు అని పిలిచేవారు. ఆయన తల్లి అంజనాదేవి ఇప్పటికీ అలాగే పిలుస్తారు. చిరంజీవి తండ్రి పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు మారేవారు. చిన్నతనంలో చిరంజీవి తన నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండేవారు. చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ఊళ్లలో సాగింది. చిరంజీవి ఎన్‌సీసీ క్యాడిట్ కూడా. ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. నర్సాపూర్‌లోని శ్రీ వై.ఎన్.కాలేజీలో డిగ్రీ చదివారు. కాలేజీ రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నారు. అలా నటనపై ఆయనకు ఇష్టం పెరిగింది. డిగ్రీ పూర్తిచేసిన తరవాత చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రెండేళ్లకే సినిమాలో అవకాశం దక్కింది. Also Read: 1978లో ‘పునాదిరాళ్లు’ సినిమాతో చిరంజీవి తన నట జీవితాన్ని మొదలుపెట్టారు. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ‘పునాదిరాళ్లు’ అయినప్పటికీ ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిరంజీవి వెండితెరకు పరిచయమయ్యారు. ‘పునాదిరాళ్లు’ 1979లో విడుదలైంది. మొదటి సినిమాకి చిరంజీవి అందుకున్న పారితోషికం అక్షరాల 1,116 రూపాయలు. 1978లో రెండు సినిమాలు మాత్రమే చేసిన చిరంజీవికి ఆ తర్వాత సంవత్సరం నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేసిన చిరంజీవి.. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా మారారు. చిరంజీవికి స్టార్ డమ్ రావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. 1983 అక్టోబర్ 28న విడుదలై ‘ఖైదీ’ సినిమా చిరంజీవి స్థాయిని పెంచింది. స్టార్ డమ్‌ను తీసుకొచ్చింది. ఇది చిరంజీవికి 62వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాతో చిరంజీవికి ‘సుప్రీం హీరో’ బిరుదు వచ్చింది. ఇక అక్కడి నుంచి చిరంజీవి కెరీర్ గ్రాఫ్ పైపైకి వెళ్లిపోయింది. అప్పట్లో చిరంజీవిలా డ్యాన్సులు, ఫైట్లు చేసే హీరో లేరంటే అతిశయోక్తికాదు. నటనతో పాటు చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు ఆయన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయి. ‘విజేత’, ‘చంటబ్బాయి’, ‘స్వయంకృషి’, ‘అత్తకు యముడు అమ్మాయి మొగుడు’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాలు చిరంజీవిని మెగాస్టార్‌ను చేశాయి. అయితే, కెరీర్ పరంగా చిరంజీవి కూడా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 1994 నుంచి 96 వరకు కెరీర్ పరంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వరుస పరాజయాలు చిరంజీవిని ఇబ్బంది పెట్టాయి. అయితే, 1997లో వచ్చిన ‘హిట్లర్’, ‘మాస్టర్’ సినిమాలు మళ్లీ చిరంజీవిని హిట్ ట్రాక్‌లోకి తీసుకొచ్చాయి. 2002లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమా చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ వెంటనే వచ్చిన ‘ఠాగూర్’ సినిమా చిరంజీవిని రాజకీయాల వైపు మళ్లించింది. 2008 ఆగస్టు 26న తిరుపతిలో భారీ సభ ఏర్పాటుచేసి ‘ప్రజారాజ్యం’ పార్టీని చిరంజీవి ప్రకటించారు. ఎన్టీ రామారావు మాదిరిగా చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టిస్తారని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. 2009 ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలని మాత్రమే గెలుచుకుంది. ఆ తరవాత పరిణామాలు కూడా చిరంజీవిని బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో పార్టీని నడపడం తనవల్ల కాదని భావించి 2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల వల్ల సుధీర్ఘ విరామం తీసుకున్న చిరంజీవి అభిమానుల కోరిక మేరకు 2017లో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. తన 150వ చిత్రంగా ‘ఖైదీ నెంబర్ 150’లో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాతో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. కిందటేడాది ‘సైరా’ లాంటి చారిత్రక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సోషల్ మెసేజ్‌తో కూడిన చిత్రాన్ని చేస్తున్నారు. చిరంజీవి మరెన్నో విజయాలు అందుకుని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EfjdvP

No comments:

Post a Comment

UFC 324 live stream: how to watch Gaethje vs Pimblett, start time, preview, full card

As UFC makes Paramount Plus debut with much-anticipated main event, follow our guide to watch a UFC 324 live stream online from anywhere. ...